Janasena: జనసేన ఆవిర్భావ సభ’ను విజయవంతం చేద్దాం- ‘నాదెండ్ల
- By HashtagU Desk Published Date - 04:35 PM, Mon - 7 March 22
ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ మన చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా… మన ప్రాంత ఔన్నత్యం ప్రతిబంబించేలా ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఆకాంక్షించారు. ఈ సభ కోసం జనసైనికులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, పోలీస్ శాఖ పర్మిషన్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా సభ నిర్వహించి తీరుతామని చెప్పారు. రహదారులు జనసేన జెండాలతో నిండి పోవాలని, పండగ వాతావరణం తీసుకురావాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయంలో విజయవాడ, కృష్ణా జనసేన కమిటీల సమావేశం జరిగింది. ఆవిర్భావ సభను ఎలా విజయవంతం చేయాలి అనే దానిపై నాయకులకు, కమిటీ సభ్యులకు మనోహర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “ ఆవిర్భావ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది జనసైనికులు, వీర మహిళలు తరలి వస్తారు. వాళ్లందరినీ కృష్ణా, గుంటూరు జిల్లా నాయకులు సాదరంగా ఆహ్వానించాలి. వాళ్లకు అవసరమైన ఆహారం, మంచినీళ్లు దారిలోనే అందించాలి. వాళ్లు సభకు వచ్చిన దగ్గర నుంచి సభ పూర్తయ్యి తిరిగి వెళ్లే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీటింగ్, వాళ్లు సభకు చేరుకోవడానికి ప్రత్యేక దారి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్లు ఎక్కడ ఉన్నా సభ కనిపించేలా ఎల్.ఇ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం.
సీఎం జగన్ పిచ్చి నిర్ణయాలపై సమరానికి సిద్ధమవ్వాలి :
ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతోంది. మొండి పట్టుదల, పిచ్చి నిర్ణయాలతో అన్ని వర్గాలకు నష్టం వాటిల్లుతోంది. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆయన వైఖరిపై మనమంతా సమరానికి సిద్ధమవ్వాలి. ఈ సభే దానికి నాంది కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వాళ్లలో ధైర్యం నింపే విధంగా అధ్యక్షులవారు కూడా పని చేసుకుంటూ వెళ్తున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఎన్నో అవమానాలు, ఇబ్బందులకు గురయ్యారు. అయినా ఆ రోజు దేనికోసమైతే పార్టీ ఏర్పాటు చేశారో… ఈ రోజుకీ వాటికే కట్టుబడి ఉన్నారు. ఈ రోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా మధ్యతరగతి, పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు పోటీ చేయగలుగుతున్నారు అంటే దానికి కారణం ఆయన పార్టీ స్థాపించడమే.
పర్మిషన్ ఇవ్వకున్నా సభ జరిగి తీరుతుంది:
సభ నిర్వహణ కోసం మన పార్టీ నాయకులు పోలీసు శాఖ పర్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఇస్తారనే నమ్మకం ఉంది. ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లతో అనుమతులు ఇవ్వడానికి నిరాకరించినా.. సభ మాత్రం జరిగి తీరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సభా వేదిక నుంచి మన అధినేత ఏం మాట్లాడతారా అని ప్రజలందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, మనం ఏ మార్గంలో నడవాలి? రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపై పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఇతర పార్టీల్లా జనసేన పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. ప్రజా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తుంది. అందుకు నిదర్శనమే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నాలుగు నెలలకే భవన నిర్మాణ కార్మికుల కోసం రోడ్ల మీదకు వచ్చాం. ఈ సభను అందరూ సొంత కార్యక్రమంలా భావించి విజయవంతం చేద్దాం.
రెచ్చగొడతారు… రెచ్చిపోవద్దు:
సభకు ఆటంకం కలిగించడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. మాటలతో రెచ్చగొడతారు, ఇబ్బంది పెట్టాలని చూస్తారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. జనసేన నాయకులు గానీ, జనసైనికులు గానీ, వీరమహిళలు గానీ వారి ఉచ్చులో పడొద్దు. ఎక్కడా కూడా సహనం కోల్పోవద్దు. ఇంత పెద్ద స్థాయిలో మీటింగ్ జరుగుతుంటే అసూయతో రగిలిపోయి తప్పుడు ప్రచారాలు చేస్తారు. మీరు మాత్రం ఇంట్లో సొంత కార్యక్రమం చేస్తున్నట్లు హుందాగా వ్యవహరించండి. ఈ సమావేశం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకోండి. సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. స్థానికంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయండి. అన్ని జిల్లాల నుంచి వచ్చే జనసైనికులను ఆహ్వానించడమే కాకుండా.. మన నాయకులు, కార్యకర్తలను సమావేశానికి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. సభ విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని” కోరారు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.