Modi-Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మోదీ పైనే పెను భారం- ఇక రంగంలో దిగాల్సిందేనా?
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకంగా మారింది. అటు వ్యక్తిగతంగా, ఇటు దౌత్య పరంగా కూడా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
- By Hashtag U Published Date - 09:48 AM, Fri - 25 February 22

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకంగా మారింది. అటు వ్యక్తిగతంగా, ఇటు దౌత్య పరంగా కూడా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా దేశానికి తీసుకురావడం ఆయన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. దీంతో తమ బిడ్డలను క్షేమంగా తీసుకురావాలని వారి తల్లిదండ్రులతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది.
యుద్ధం కారణంగా విమానాలు నిలిచిపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వారిని తీసుకొచ్చే బాధ్యతను విదేశాంగ మంత్రి జయశంకర్‌కు అప్పగించారు మోదీ. ఆయన ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను పొరుగు దేశాలకు పంపించడం ద్వారా.. ఎలాంటి సమస్య రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
పెట్రోలు ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లకు చేరింది. అది 140 డాలర్లకు చేరే అవకాశం ఉంది. రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ మన దిగుమతుల మొత్తంలో కేవలం ఒక శాతమే అయినా ధరలు పెరుగుదల పెద్ద సవాలుగా మారనుంది. దేశీయ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా రాయితీలు ఇవ్వడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక బంగారం ధర చుక్కలనంటుతోంది.
ఈ మొత్తం విషయాల్లో మోదీ వ్యక్తిగత ప్రతిష్ట ఇమిడి ఉంది. మోదీకి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మంచి స్నేహం ఉంది. దాన్ని ఉపయోగించి యుద్ధం ఆపే ప్రయత్నం చేయాలని ఉక్రెయిన్ నుంచి కూడా వినతులు వచ్చాయి. ఇప్పటికే ఆయన పుతిన్‌కు ఫోన్ చేశారు. ఇప్పుడు ఎలాంటి స్కెచ్ తో మోదీ ముందడుగు వేస్తారో చూడాలి.