10 గ్రామాలను పట్టి పీడిస్తున్న ఈగలు..ఈగల గోల తట్టుకోలేక ప్రజలు విలవిల!
రాజమౌళి సినిమా ఈగ అందరికీ గుర్తుంది కదా. అందులో ఈగ చేసిన సాహసాలు అన్నీ ఇన్ని కావు. అయితే ఇక్కడ మాత్రం ఈగలు గ్రామాల్లోని ప్రజలను ఓ ఆట ఆడుకుంటున్నాయి.
- By Anshu Published Date - 10:37 PM, Sun - 11 December 22

రాజమౌళి సినిమా ఈగ అందరికీ గుర్తుంది కదా. అందులో ఈగ చేసిన సాహసాలు అన్నీ ఇన్ని కావు. అయితే ఇక్కడ మాత్రం ఈగలు గ్రామాల్లోని ప్రజలను ఓ ఆట ఆడుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 గ్రామాలు ఈ ఈగల పోరు భరించలేకపోతున్నాయి. అంతేకాదు ఈ ఈగల వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయి. ఇటువంటి వింత ఘటనలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హర్డోయ్ జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.
హర్డోయ్ జిల్లాలోని అహిరోరి బ్లాక్‌లో దాాదాపు 10 గ్రామాలు ఉన్నాయి. బధైయాన్ పుర్వా, కుయాన్, పట్టి, దహీ, సేలంపూర్, ఫతేపూర్, ఝల్ పూర్వా, నయా గావ్, డియోరియా, ఎక్ఘరా గ్రామాల్లో ఈ ఈగల పోరు ఎక్కువగా ఉంది. ఈగల వల్ల ఇక్కడి గ్రామాల్లోని కోడళ్లు తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారు. ఈగల గొడవ ఉంటుందని గ్రామాల్లోని యువకులకు పెళ్లిళ్లు కూడా కావడం లేదు.
అసలు ఇంతకీ ఈ గ్రామాల్లో ఏం జరిగిందంటే 2014 తర్వాత ఇక్కడ కమర్షియల్ పౌల్ట్రీ ఫారం ప్రారంభించారు. దానివల్ల ఇక్కడ కాలుష్యం బాగా పెరిగింది. దీంతో గ్రామాలకు ఈగలకు నివాసాలుకు మారాయి. గత మూడేళ్లలో ఈ ఈగల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈగల రొదతో గ్రామ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. భోజనం చేయడానికి కూర్చున్నా, నిద్రపోతున్నా కూడా ఈగల గోల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈగల పోరు భరించలేక ఈ గ్రామానికి వచ్చిన ఆరుగురు వధువులు ఏడాది కాలంలోనే పుట్టింటికి వెళ్లిపోయారు. సొంత ఊరిని వదిలి వస్తేనే తమతో కాపురం చేస్తామని లేకుంటే విడాకులు ఇవ్వాలని భార్యలు కోరుతున్నారు. దీంతో ఈ గ్రామంలోని మగవారి పరిస్థితి దారుణంగా తయారైంది. గ్రామంలోని ఇద్దరి యువతుల వివాహం నిశ్చయం అవ్వడంతో పెళ్లి సమయంలో మిఠాయిలపై ఈగలు వాలాయి. దీంతో వరుడి తరపు వారు పెళ్లికి నిరాకరించారు. గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా మారాయని, ఈగలను తరిమికొట్టే చర్యలు చేపట్టాలని ప్రజలు నిరసన తెలిపారు. అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటున్నా ఈగల గోల మాత్రం ఆగడం లేదు.