Maoist Arrest:భదాద్రి కొత్తగూడెం పోలీసుల అదుపులో మావోయిస్టులు
భదాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల అడవుల్లో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Author : Hashtag U
Date : 19-04-2022 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
భదాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల అడవుల్లో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని చెర్ల మండలం చింతగుప్ప అడవుల్లో మావోయిస్టు దళ సభ్యుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీసులు, సిఆర్‌పిఎఫ్ 141 బిఎన్ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా అడవుల్లోకి వెళుతున్నట్లు గుర్తించామని భద్రాచలం ఇన్‌చార్జి ఏఎస్పీ, బి రోహిత్ రాజ్ తెలిపారు. వీరిలో ఒకరిని పోలీసులు పట్టుకోగా, విచారణలో అతడు సిద్దిపేట జిల్లాకు చెందిన చెర్ల ఎల్‌ఓఎస్ సభ్యుడు బోనాల రాజు అలియాస్ గగన్ గా గుర్తించామన్నారు.
కొంతకాలం మావోయిస్టులకు సానుభూతిపరుడైన తర్వాత అతను 2021లో అండర్‌గ్రౌండ్ క్యాడర్‌లో చేరాడని… గగన్ మావోయిస్టు BKEG కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌కు గార్డుగా పనిచేశాడని ఏఎస్పీ తెలిపారు. ఇతనిపై సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదైందన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బత్తినపల్లి-కిస్తారంపాడు అడవుల్లో ఇటీవల పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన పాల్గొన్నారు. అరెస్టు చేసిన వారిని జ్యుడీషియల్ రిమాండ్‌పై ఖమ్మం జిల్లా జైలుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.