CSK vs KKR: చెన్నైకి షాకిచ్చిన కోల్ కతా
ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. దాదాపు ప్లే ఆఫ్ ఖాయమనుకున్న జట్లు ఆ ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నాయి
- By Praveen Aluthuru Published Date - 11:47 PM, Sun - 14 May 23

CSK vs KKR: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. దాదాపు ప్లే ఆఫ్ ఖాయమనుకున్న జట్లు ఆ ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కు కోల్ కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. చెపాక్ వేదికగా జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు అనుకున్న రీతిలో రాణించలేకపోయారు. ఓపెనర్లు తొలి వికెట్ కు 31 పరుగులే జోడించగా.. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కాన్వే 30 , రుతురాజ్ 17, రహానే 16 పరుగులకు ఔటవగా..రాయుడు, మొయిన్ అలీ నిరాశపరిచారు. అయితే శివమ్ దూబే ఒంటరి పోరాటం చేశాడు. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై నిలకడగా ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. జడేజా సపోర్ట్ తో స్కోర్ 140 దాటించాడు. దూబే 34 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 48 పరుగులతో నాటౌట్ గా నిలిస్తే.. జడేజా 20 రన్స్ చేశాడు. చివర్లో ధోనీ ఈ సారి మెరుపులు మెరిపించలేకపోయాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 , నరైన్ 2 , శార్థూల్ ఠాకూర్ , వైభర్ అరోరా ఒక్కో వికెట్ పడగొట్టారు.
టార్గెట్ పెద్దది కాకున్నా బౌలింగ్ పిచ్ పై కోల్ కతా కూడా తడబడింది. కేవలం 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గుర్బాజ్ 1 , జాసన్ రాయ్ 12 పరుగులకే ఔటవగా.. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 9 రన్స్ కే వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు కీలక పార్టనర్ షిప్ తో చెన్నై ఆశలపై నీళ్ళు చల్లారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 99 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రింకూ సింగ్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 రన్స్ చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. నితీశ్ రాణా కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో కోల్ కతా నైట్ రైడర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. నితీశ్ రాణా 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 57 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 15 పాయింట్లు ఉండగా… తాజా విజయంతో కోల్ కతా 12 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.
Read More: Karnataka CM: సీఎం బరిలో డికె శివకుమార్?