Pink Bars: కేవలం మహిళలకు మాత్రమే! ఢిల్లీలో ప్రత్యేకంగా పింక్ బార్లు
సమాజం మారుతోంది. మహిళలు మద్యం తాగడం పెద్ద తప్పమే కాదన్న భావన చాలా మందిలో బలపడుతోంది.
- By Hashtag U Published Date - 09:32 AM, Tue - 1 March 22

సమాజం మారుతోంది. మహిళలు మద్యం తాగడం పెద్ద తప్పమే కాదన్న భావన చాలా మందిలో బలపడుతోంది. అందుకే వారి కోసం ప్రత్యేకంగా బార్లు ఉంటే ఇబ్బందులేవీ లేకుండా ఆనందిస్తారని భావించే వారూ అధిక సంఖ్యలో ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పింక్ బార్ పేరుతో ఈస్ట్ ఢిల్లీలో ఓన్లీ లేడీస్ కోసం చాలా ఏళ్ల క్రితమే ప్రత్యేకంగా మద్యం షాపు ఏర్పాటయింది. వోడ్కా, వైన్‌లకు ఇక్కడ ఆదరణ అధికంగా ఉంది.
కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఎక్సయిజ్ పాలసీలో మరిన్ని పింక్ బార్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొత్తగా 850 వైన్ షాపులు, బార్లకు పర్మిషన్ ఇవ్వనుండగా, అందులో పింక్ బార్లు కూడా ఉండనున్నాయి. మద్యం అమ్మకాలను నిషేధించే డ్రై డేస్ సంఖ్యను కూడా తగ్గించనుంది.
దీనిపై BJP మండిపడుతోంది. మహిళలను మందుమతులుగా మార్చుతారా అని ప్రశ్నిస్తోంది. వారు తాగి తూలుతూ వీధుల్లో నడవాలన్నదే ఉద్దేశమా అని నిలదీస్తోంది. శుక్రవారం నుంచి ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి సన్నాహాలు చేస్తోంది. మొత్తం 10 లక్షల మందిని సర్వే చేసి వారి ఒపీనియన్ తెలుసుకోవడానికి భారీ కార్యక్రమమే చేపట్టనుంది. ఒక్క పింక్ బార్లపైనే కాకుండా, ఎక్సయిజ్ పాలసీలోని ఇతర అంశాలపైనా రిఫరెండం నిర్వహించనుంది. ఢిల్లీని లిక్కర్ సిటీగా మార్చడానికి సీఎం కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. దీనిని ఆప్ ఖండిస్తోంది. లిక్కర్ మాఫియా నుంచి ఇన్‌కం రాదన్న ఉద్దేశంతోనే BJP లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శిస్తోంది.