Kashmir: కశ్మీర్‍లో హిందువుల వరుస హత్యలు.. భయంతో వలసలు పోతున్న పండిట్లు!
- By Anshu Published Date - 11:19 AM, Sat - 4 June 22

ప్రస్తుతం కశ్మీర్ లో హిందువుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ ను మూడు ముక్కలు చేసి అక్కడ శాంతి నెలకొల్పుతునట్లు చెప్పుకొచ్చిన కేంద్రం ఇప్పుడు హిందువుల హత్యలను అడ్డుకోలేకపోతోంది. వరుస హత్యలతో భయపడిపోయిన పండిట్లు అక్కడినుంచి వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కశ్మీరీ పండిట్ల పునరావాస డిమాండ్ ను కేంద్రం తిరస్కరించినప్పటికీ భయాందోళనకు గురైన వందలాది మంది తాజాగా లోయ నుంచి హిందూ మెజారిటీ జమ్మూ జిల్లాలకు బయలుదేరారు.
ప్రముఖ పండిట్ ల సంఘం కాశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి, చీఫ్ జస్టిస్ కి ఒక బహిరంగ లేఖలో వరుస హత్యలతో భయపడుతున్న పండిట్ లను విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దక్షిణ కాశ్మీర్‌లోని మట్టన్, వెస్సు, శ్రీనగర్‌లోని షేక్‌పోరా, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారాలోని పండిట్ ట్రాన్సిట్ కాలనీల నుండి పండిట్ ఉద్యోగులు,వారి కుటుంబాలను తీసుకొని వేలాది వాహనాలు ఉదయాన్నే లోయ నుండి బయలుదేరాయి. అనంత్‌నాగ్‌లోని మట్టన్ ట్రాన్సిట్ కాలనీలో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్‌లు జూన్ 1 నుండి 80 శాతానికి పైగా కుటుంబాలు జమ్మూకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమకు ఉత్తుత్తి హామీలు ఇస్తున్నాయని వారు తెలిపారు. ఇటీవలి హత్యల తర్వాత తాము సురక్షితంగా లేమని వారు చెప్తున్నారు.