Kakani Govardhan Reddy : వైసీపీ నాయకుల అక్రమ దందా.. బయటపడుతున్న కాకాణి బాగోతం
Kakani Govardhan Reddy : వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారాలపై ఒక్కొటీగా అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.
- By Kavya Krishna Published Date - 01:30 PM, Wed - 11 June 25

Kakani Govardhan Reddy : వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారాలపై ఒక్కొటీగా అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఆయన నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్ గేటు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన అంశం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కంటైనర్ క్యారియర్ వాహనాల నుంచి ఒక్కో ట్రిప్‌కు రూ.10,000 నుంచి రూ.20,000 వరకూ వసూలు చేస్తూ, మొత్తం రూ.44 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ అక్రమ కార్యకలాపాల్లో భాగంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి నేరుగా ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కృష్ణపట్నం లారీ అసోసియేషన్‌ను నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ అనే సంస్థను స్థాపించి పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపులో తనవంతు పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ కారణంగా సుమారు 60 ఎగుమతి కంపెనీలు పోర్టు నుంచి వెనక్కి తగ్గాయి. దీంతో 20 వేల మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవగా, కాకాణిని (ఏ1గా) సహా మరో 10 మంది అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Gali Janardhan Reddy : ఓఎంసీ కేసు.. గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్
పోర్టు ఉద్యోగుల వాదన ప్రకారం, వైసీపీ నాయకుల అక్రమ వసూళ్లు, భారీ టోల్ చార్జీలు వల్లే కంటైనర్ టెర్మినల్‌ను పోర్టు యాజమాన్యం మూసివేసినట్లు తెలుస్తోంది. కంపెనీలు తిరిగి చెన్నై పోర్టును ఆశ్రయించడంతో కృష్ణపట్నంలో వ్యాపార ఉత్సాహం దారుణంగా తగ్గిపోయింది. ఫలితంగా వందలాది ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు నిలువునా మునిగిపోయాయి.
ఈ నేపథ్యంలో నష్టపోయిన ట్రాన్స్‌పోర్టర్ షేక్ ఫరీద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు వేగం పుంజుకుంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు ఎలాంటి భయభ్రాంతులకు లోనవకుండానే ఈ దందా నిర్వహించినట్లు ఫరీద్ తెలిపాడు. ఫిర్యాదుతో పోలీసుల దృష్టి ఈ అక్రమాలకు మళ్లింది.
గతంలో కూడా కాకాణిపై క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, గ్రావెల్ అక్రమ రవాణా, ఫోటో మార్ఫింగ్ వంటి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిసి ఆయనపై ఉన్న ఆరోపణలు మరింత తీవ్రమవుతున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఈ అక్రమ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి.
Kaleshwaram Project Commission : కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్న క్రమంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు