Israel War : ఇజ్రాయెల్ వెనకడుగు.. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్‌కు తెర ?
Israel War : గాజాలో నిర్వహిస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ ఆర్మీ త్వరలోనే ముగించబోతోందని తెలుస్తోంది.
- By Pasha Published Date - 08:43 AM, Sun - 24 December 23

Israel War : గాజాలో నిర్వహిస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ ఆర్మీ త్వరలోనే ముగించబోతోందని తెలుస్తోంది. ఈమేరకు ఇజ్రాయెలీ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఒక న్యూస్ రిపోర్టును ప్రసారం చేసిందని సమాచారం. గ్రౌండ్ ఆపరేషన్‌లో భాగంగా గాజాలోకి పంపిన సైనికులను వెనక్కి పిలిపించుకునేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ రెడీ అవుతోందని అంటున్నారు. గాజాపై దాడికి మోహరించిన సైనికుల సంఖ్యను క్రమంగా తగ్గించనున్నట్లు చెబుతున్నారు. తదుపరిగా అవసరమైతే గాజాపై వైమానిక దాడులనే ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తుందని ఆ మీడియా రిపోర్టులో ప్రస్తావించారు. ఇజ్రాయెల్, గాజా మధ్య బార్డర్ ఏరియాలో బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తర గాజాను ఈజీగానే అదుపులోకి తీసుకున్న ఇజ్రాయెలీ ఆర్మీ.. దక్షిణ గాజాలో పెను సవాళ్లను ఎదుర్కొంటోందని ఇజ్రాయెలీ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నివేదించింది. ఇప్పటికే గాజా నుంచి గొలానీ బ్రిగేడ్‌ను ఇజ్రాయెల్ ఆర్మీ వెనక్కి పిలిపించింది. తదుపరిగా దశల వారీగా మిగతా బ్రిగేడ్‌లను కూడా ఉపసంహరిస్తారనే డిస్కషన్ నడుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
అక్టోబరు 7 నుంచి గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ(Israel War) ఇప్పటివరకు 20వేల మందికిపై సామాన్య పౌరుల ప్రాణాలు తీసింది. గత 75 రోజులుగా యుద్ధం చేస్తున్నా గాజాపై ఇజ్రాయెల్ పట్టు సాధించలేకపోయింది. గ్రౌండ్ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ దాదాపు ఫెయిల్ అయింది. అత్యాధునిక టెక్నాలజీ, సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ వందలాది మంది ఇజ్రాయెలీ సైనికులు ఈ యుద్ధంలో చనిపోయారు. హమాస్ మిలిటెంట్ల గొరిల్లా యుద్ధంతో భయకంపితులైన ఇజ్రాయెలీ సైనికులు టెన్షన్‌లో తమ తోటి సైనికులను కాల్చి చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. చివరకు గాజాలో ఉన్న ఇజ్రాయెలీ బందీలను కూడా ఇజ్రాయలీ సైనికులు టెన్షన్‌లో కాల్చి చంపారు. గాజాలోని ఎవరిని చూసినా హమాస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు తెగబడుతోందనే దానికి ఈ ఘటనలే నిదర్శనం. ఇటీవల గాజాలోని ఒక చోట కుటుంబాల ఎదుటే 11 మంది సామాన్య యువకులను ఇజ్రాయెలీ ఆర్మీ కాల్చి చంపింది. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది.