IPL 2022: ఐపీఎల్ రెండో వారం రేటింగ్స్ కూడా డౌన్
ఐపీఎల్ 15వ సీజన్ బీసీసీఐకి ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది. టోర్నీ విజయవంతంగా సాగుతున్నా...
- By Naresh Kumar Published Date - 11:17 PM, Fri - 15 April 22

ఐపీఎల్ 15వ సీజన్ బీసీసీఐకి ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది. టోర్నీ విజయవంతంగా సాగుతున్నా… మ్యాచ్ లు హోరాహోరీగా జరిగి అలరిస్తున్నా టీవీ రేటింగ్స్ విషయంలో మాత్రం బీసీసీఐకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. గత సీజన్ తో పోలిస్తే తొలి వారం రేటింగ్స్ పడిపోగా.. ఇప్పుడు రెండో వారం రేటింగ్స్ కూడా పుంజుకోలేదు. తొలి వారం ఆర్ఆర్ఆర్ సినిమా దెబ్బకొడితే… ఇప్పుడు కేజీఎఫ్ ప్రభావం పడినట్టు అర్థమవుతోంది. అటు టీవీల్లో.. ఇటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ మ్యాచ్‌లను చూసే వారి సంఖ్య గతంతో పోలిస్తే చాలా తగ్గింది. ఈ ఊహించని పరిణామం స్టార్ ఇండియాకు తీవ్రని నష్టం తెచ్చేలా ఉంది.
ఈ సీజన్‌కు యాడ్స్ రేట్లను స్టార్ ఇండియా 25 శాతం పెంచినా.. గతేడాది ఆదరణ నేపథ్యంలో కంపెనీలు ఎగబడ్డాయి. కానీ ఈ సారి ప్రేక్షకాదరణ తగ్గడంతో కంపెనీలు గోల చేస్తున్నట్టు సమాచారం. గతేడాదితో పోలిస్తే తొలి వారం టీఆర్‌పీ టీఆర్‌పీ రేటింగ్స్ ఏకంగా 33 శాతం తగ్గిపోగా.. వ్యూయర్ షిప్ 14 శాతం పడిపోయింది. రెండో వారంలో టీఆర్‌పీ రేటింగ్స్ 28 శాతం తగ్గిపోయింది. బార్క్ ఇండియా లెక్కల ప్రకారం గతేడాది తొలి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ టీఆర్‌పీ రేటింగ్ 3.75గా ఉండగా.. ఈ సారి అది 2.52కి పడిపోయింది. ఆన్‌లైన్ వేదికగా వ్యూయర్‌షిప్ గతేడాది ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలో 267.7 మిలయన్స్ వ్యూస్ రాగా.. ఈ సారి ఆ సంఖ్య 229.06 మిలియన్స్‌కు పడిపోయింది. రెండో వారంలో కూడా వ్యూస్ తగ్గాయి. వ్యూయర్‌షిప్, టీఆర్‌పీ రేటింగ్స్ పడిపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు ఈ వారమే విడుదలైన కేజీఎఫ్ ఎపెక్ట్ గట్టిగానే పడింది. అదే సమయంలో టైటిల్ ఫేవరెట్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కూడా రేటింగ్స్ పై పడిందని అంచనా వేస్తున్నారు. చెన్నై ఇప్పటి వరకూ ఒకే ఒక మ్యాచ్ గెలవగా… ముంబై అసలు ఖాతానే తెరవలేదు. ఇదిలా ఉంటే తాజా పరిణామాలు బీసీసీఐకి కాస్త ఇబ్బంది కలిగించేవే. ఎందుకంటే ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కుల అమ్మకం ద్వారా ఈ సారి 40 వేల కోట్ల పైనే ఆర్జించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు రేటింగ్స్ పడిపోవడంతో జూన్ లో జరిగే ఆన్ లైన్ వేలంలో ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.