Palm Oil: మన వంటనూనె దిగుమతులపై మళ్లీ దెబ్బ.. ఈసారి ఇండోనేషియా రూపంలో ఎఫెక్ట్!
ఎడారిలో ఇసుకకు కొరత, సముద్రంలో ఉప్పుకు కొరత వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండోనేషియా పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ పండించే దేశం అదే.
- By Hashtag U Published Date - 10:27 AM, Sun - 10 April 22

ఎడారిలో ఇసుకకు కొరత, సముద్రంలో ఉప్పుకు కొరత వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండోనేషియా పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ పండించే దేశం అదే. అలాంటి చోట వంటనూనెకు కరువొచ్చింది. ఆ వంటనూనె కోసం క్యూలో నిలుచుని ఇద్దరు వ్యక్తులు మరణించడం మరింత విషాదానికి దారితీసింది. ఈమధ్యకాలంలో ఆ దేశంలో పామాయిల్ కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి మన దేశంలో బాంబ్ పేల్చనుందా?
పామాయిల్ కు దేశీయంగా ఉన్న డిమాండ్ వల్ల ఇండోనేషియా ప్రభుత్వం దాని ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనికి కారణం లేకపోలేదు. అక్కడ డిసెంబర్ లో 3.98 మిలియన్ టన్నులు దిగుబడి వచ్చింది. అదే జనవరికి 3.86 మిలియన్ టన్నులకు పడిపోయింది. అందుకే ఎగుమతుల్లో దశలవారీగా కోతలు విధించింది. చివరకు పన్నులు కూడా విధించక తప్పలేదు.
ఇండోనేషియాలో పామాయిల్ కు కరువొస్తే మనకేంటి అనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు కథ. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల సన్ ఫ్లవర్ ఉత్పత్తి, సరఫరా పై దెబ్బపడింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సన్ ఫ్లవర్ వంటనూనెకు డిమాండ్ పెరిగింది. దాని ధర పెరగడంతో కొందరు పామాయిల్ పై ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు ఇండోనేషియాలో దిగుబడి తగ్గడంతో అక్కడి నుంచి కూడా వచ్చే దిగుమతులు తగ్గిపోయే ఛాన్సుంది.
అటు మలేషియాలోని పామాయిల్ తోటల్లో పనిచేసేవారే కరువయ్యారు. ఇటు దక్షిణ అమెరికా దేశాల్లో సోయాబీన్ నూనె ఉత్పత్తీ పడిపోయింది. కరువు పెరిగింది. ఈ పరిస్థితులకు ఆజ్యం పోసినట్టుగా ఉంది ఇండోనేషియా ప్రభుత్వ నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోఉత్పత్తుల ధరలు పెరగడంతో.. డీజిల్ లో 30 శాతం పామాయిల్ ను వాడి బయోడీజిల్ గా వాడాలని నిర్ణయించింది. దీంతో పెద్ద ఎత్తున పామాయిల్ అటువైపు వెళుతోంది.
ఈ పరిస్థితులన్నీ మనల్ని దెబ్బకొడుతున్నాయి. ఎందుకంటే.. ప్రపంచంలో ఎక్కువగా వంటనూనెను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనదీ ఉంది. ఏడాదికి సగటున 14 మిలియన్ టన్నుల వరకు వంటనూనెను దిగుమతి చేసుకుంటాం. వీటిలో పామాయిల్ ఎలా లేదన్నా 8 – 9 మిలియన్ టన్నులు, సన్ ఫ్లవర్ ఆయిల్ 2.5 మిలియన్ టన్నులు ఉంటుంది. మనకు పామాయిల్ ఎక్కువగా ఇండోనేషియా నుంచే వస్తోంది. ఇప్పుడక్కడ దిగుబడి తగ్గిపోయింది. ఇటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అక్కడి నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో మన దేశంలో వంటనూనెకు కటకట తప్పేలా లేదు.