Gas Cylinder : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- By Vamsi Chowdary Korata Published Date - 10:10 AM, Wed - 1 October 25

ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు సవరిస్తూ కీలక ప్రకటనను చేశాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వినియోగదారులకు షాకిచ్చాయి. దసరాకు ఒక రోజు ముందే కమెర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలినట్లయింది.
ఢిల్లీలో ఇప్పుడు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 15.50 మేర పెరిగి రూ. 1595.50 వద్దకు చేరుకుంది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అయితే 14.2 కిలోల ఎల్‌పీజీ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఏ మార్పులు చేయలేదు. చాలా కాలం నుండి గృహ వినియోగ వంట గ్యాస్ ధరల్లో మార్పులు చేయడం లేదు. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర కిలో లీటర్ రూ. 3052.50 మేర పెరిగింది.
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం కమెర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ఇప్పుడు రూ. 1580 నుంచి రూ. 1595.50 వద్దకు చేరింది. ఇక చెన్నైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 15.50 పెరిగి రూ. 1754.50కి చేరింది. ముంబై నగరంలో రూ. 15.50 మేర పెరిగి రూ. 1547 వద్దకు ఎగబాకింది. కోల్‌కతా నగరంలో 19 కిలోల సిలిండర్ రేటు రూ. 1700.50 వద్దకు చేరుకుంది.
హైదరాబాద్‌లో కమెర్షియల్ సిలిండర్ ధర రూ.15.50 మేర పెరిగి రూ. 1816.50 వద్దకు చేరుకుంది. దేశంలోని టాప్ మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరంలోనే ధర ఎక్కువగా ఉందని తెలుస్తోంది. గృహ వినియోగ గ్యాస్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ రేటు ఈరోజు రూ. 905 వద్ద ఉంది. చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతోంది.