800 Earthquakes : వణికిపోయిన ఐస్‌లాండ్.. 14 గంటల్లో 800 భూప్రకంపనలు
800 Earthquakes : ఈ మధ్య ఎందుకో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పెరిగిపోయాయి.
- Author : Pasha
Date : 11-11-2023 - 2:05 IST
Published By : Hashtagu Telugu Desk
800 Earthquakes : ఈ మధ్య ఎందుకో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పెరిగిపోయాయి. ఈక్రమంలోనే బ్రిటన్ పొరుగుదేశం ఐస్‌లాండ్‌లో గత 14 గంటల్లో (శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు) దాదాపు 800 సార్లు భూమి కంపించింది. దీంతో ఐస్‌లాండ్‌లో ఎమర్జెన్సీని ప్రకటించారు. దేశంలోని నైరుతి రేక్‌జాన్స్ ద్వీపకల్పంలో ఉన్న గ్రిండావిక్ గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న ఏరియాలలో వందలాదిగా స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ ప్రకంపనల తీవ్రత 5.2గా నమోదైంది. శుక్రవారం రాత్రి ఐస్‌లాండ్ రాజధాని నగరం రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు బలమైన ప్రకంపనలు సంభవించాయి. దాంతో రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలను నిలిపివేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐస్‌లాండ్‌లో జరగబోయే అగ్నిపర్వత విస్ఫోటనాలకు ఈ వరుస భూప్రకంపనలు సంకేతాలు అని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌లాండ్‌లో 33 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకే అక్కడ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు సర్వసాధారణం. తాజా గణాంకాలను చూసుకుంటే.. 2021 మార్చిలో, 2022 ఆగస్టులో, 2023 జూలైలో ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవించాయి. తాజాగా వందలాది భూప్రకంపనల నేపథ్యంలో సహాయక చర్యల కోసం అగ్నిపర్వతాల పరిసర ప్రాంతాలకు పెద్దసంఖ్యలో పెట్రోలింగ్ నౌకలు, హెలికాప్టర్లను(800 Earthquakes) తరలించారు.