BJP : అనధికార ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరఢా.. బీజేపీ నేతలకు జరిమానా
- By Prasad Published Date - 09:14 PM, Wed - 29 June 22

హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనధికార బ్యానర్లు,హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన బీజేపీకి కార్యకర్తలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కూడిన బీజేపీకి చెందిన భారీ బ్యానర్లు, పోస్టర్లు నగరమంతటా వెలిశాయి. వీటిని నగర ప్రజలు ట్విట్టర్ ద్వారా GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (EVDM)కి ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సంబంధిత నేతలకు జరిమానా విధించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ సమావేశానికి పలువురు బీజేపీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిలో అనుమతి లేని వాటికి జీహెచ్ఎంసీ జరిమానాలు విధించింది.