Gutta: మండలి ఛైర్మన్ ఎన్నికకు గుత్తా ఏకగ్రీమయ్యేనా?
ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
- By Hashtag U Published Date - 11:04 AM, Sun - 13 March 22

ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును ఖరారు చేయగా, ఆదివారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సుఖేందర్ రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా సంతకాలు చేసినట్లు సమాచారం. దీంతో మండలి కొత్త చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనంగా జరగనుంది. మండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ముదిరాజ్ పేరును కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే డిప్యూటీ చైర్మన్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత బండ ప్రకాష్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఖాళీ అయిన చీఫ్ విప్‌తో పాటు ముగ్గురు విప్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
శాసనమండలి చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నర్సింహాచార్య శనివారం విడుదల చేశారు. కౌన్సిల్ సభ్యులందరికీ వివరాలను పంపారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సాయంత్రం ఐదు గంటల వరకు నామి నేషన్‌ల కార్యక్రమం సాగుతుంది. ఈ నెల 14వ తేదీ ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక జరగనుంది. 40 మంది సభ్యులున్న మండలిలో ఎంఐఎంకు చెందిన ఇద్దరు సభ్యులు సహా టీఆర్‌ఎస్‌కు 38 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సభ్యుడిని మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉండడంతో కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 15న డిప్యూటీ చైర్మన్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.