PM Modi: ప్రధాని మోడీతో గూగుల్ సీఈవో సమావేశం..కీలక విషయాలపై చర్చ!
- By Anshu Published Date - 10:06 PM, Mon - 19 December 22

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. ఢిల్లీకి వచ్చిన గూగుల్, అల్ఫాబెట్ బాస్ పిచాయ్ తో మోడీ సమావేశం అయ్యి పలు విషయాలు చర్చించారు. అయితే వారు ఏయే అంశాలపై చర్చించారో ట్విట్టర్ ద్వారా పిచాయ్ ప్రకటించారు. దేశంలో టెక్నాలజీ రంగ అభివృద్ధి, అందరికీ ఇంటర్నెట్, భారత జీ20 ప్రెసిడెన్సీ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ప్రధాని మోడీని కలిసిన తర్వాత గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ ట్విట్టర్ ద్వారా పలు విషయాలను వెల్లడించారు. మోడీ నాయకత్వంలో సాంకేతిక రంగంలో మెరుపు వేగంతో మార్పులు వస్తాయన్నారు. భారత్ చేపట్టిన జీ20 అధ్యక్షత గురించి కూడా మోడీ ప్రస్తావించినట్లు తెలిపారు. తమ మధ్య బలమైన భాగస్వామ్యం కొనసాగుతుందని, భారత జీ20 ప్రెసిడెన్సీకి తాము పూర్తిగా మద్దతిస్తున్నామని వెల్లడించారు. అందరికీ అడ్వాన్స్ ఓపెన్ ఇంటర్నెట్ అందేలా తీసుకునే చర్యలకు తాము సపోర్ట్ అందిస్తామని సుందర్ పిచాయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కాగా ఇండోనేషియా నుంచి జీ20 ప్రెసిడెన్సీని ఇండియా ఈనెల 1వ తేదీన అందుకున్నాక వచ్చే ఏడాది ఇండియాలోనే జీ20 సదస్సును నిర్వహించనున్నారు. సుందర్ పిచాయ్ ప్రధానిని కలిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం అయ్యారు. భారతీయ టాలెంట్, వివేకానికి సుందర్ పిచాయ్ నిదర్శనంగా ఉన్నారని రాష్ట్రపతి ఆయన్ని అభినందించారు. భారత్‍లో యూనివర్సల్ డిజిటల్ లిటరసీకి కృషి చేయాలని పిచాయ్‍ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు.