Hyderabad: శరవేగంగా పాతబస్తీ రోడ్డు విస్తరణ పనులు
హైదరాబాద్ లో సమస్య ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ట్రాఫిక్ సమస్య అని చెప్పవచ్చు. గతంలో రోడ్ల పరిసర ప్రాంతాలు కబ్జాకు గురి కావడంతో రోడ్ల విస్తరణకు సమస్యలు తలెత్తాయి
- Author : Praveen Aluthuru
Date : 19-09-2023 - 6:48 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్ లో సమస్య ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ట్రాఫిక్ సమస్య అని చెప్పవచ్చు. గతంలో రోడ్ల పరిసర ప్రాంతాలు కబ్జాకు గురి కావడంతో రోడ్ల విస్తరణకు సమస్యలు తలెత్తాయి మరోవైపు రియల్ ఎస్టేట్ కారణంగా అనేక రోడ్లను విస్తరించలేకపోతున్నారు. కొందరు డబ్బులిచ్చి మేనేజ్ చేస్తున్నారు. సామాన్యులు రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లను సైతం కోల్పోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జెహెచ్ఎంసి పాతబస్తీ రోడ్ల పరిస్థితిపై త్వరితగతిన చర్యలు చేపట్టింది.
పాతబస్తీలోని బండ్లగూడ-ఎర్రకుంట రహదారిపై జిహెచ్ఎంసి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించింది. బార్కాస్ – పహాడీషరీఫ్ రహదారిని కలిపేలా రోడ్డును 100 అడుగులకు విస్తరించనున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఉన్నఆస్తులను బల్దియా స్వాధీనం చేసుకుంది. ఈ రోడ్డు విస్తరణ పూర్తయ్యాక పెద్ద వాహనాలు అంతర్గత రింగ్ రోడ్డు (ఆరామ్‌ఘర్ – చాంద్రాయణగుట్ట – ఎల్‌బి నగర్) మరియు శ్రీశైలం రోడ్ (చంద్రాయణగుట్ట – పహాడీషరీఫ్ మీదుగా ఆర్‌జిఐ విమానాశ్రయం) మధ్య ప్రయాణించడానికి రహదారి అనుసంధానంగా పని చేస్తుంది.
ఇప్పటి వరకు ఈ రహదారిపై చిన్న వాహనాలు మాత్రమే వెళ్లేవి. దీనిని 100 అడుగులకు విస్తరించిన తర్వాత బస్సులతో సహా భారీ వాహనాలు ఈ మార్గం గుండా వెళతాయి. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల దూరాన్ని తగ్గించినట్టు అవుతుంది. వర్షపు నీటిని మళ్లించేందుకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ, జీహెచ్‌ఎంసీ రోడ్డుపై పెద్ద పైపులైన్ పనులు చేపట్టాయి. రోడ్డు విస్తరణ పనుల అనంతరం అత్యాధునిక వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్ పనులు చేపడుతుంది. ఈ మార్గంలో ఉన్న నూరి షా ట్యాంక్ చుట్టూ జీహెచ్‌ఎంసీ వాక్‌వేను అభివృద్ధి చేయనుంది. చుట్టూ ప్రక్కల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి.