GHMC : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరిన జీహెచ్ఎంసీ మేయర్
హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల డ్రైనేజీలు
- Author : Prasad
Date : 20-07-2023 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్, ఫిల్మ్‌నగర్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలని మేయర్ విజయలక్ష్మీ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని ఖాళీ చేయించి అందులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నగరవాసులు బయటకు రావాలని సూచించారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సహాయ కార్యక్రమాల కోసం 9000113667 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.