BRS Meeting: బీఆర్ఎస్ ఆత్మీయ సభలో విషాదం…
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో అపశృతి చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా... ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి
- Author : Praveen Aluthuru
Date : 12-04-2023 - 1:33 IST
Published By : Hashtagu Telugu Desk
BRS Meeting: తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో అపశృతి చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా… ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు జిల్లాల వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళన సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ మద్దతుదారులతో సభలు నిర్వహించి తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతూ బాణసంచా పేల్చారు. దీంతో నిప్పురవ్వలు ఎగసి పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. దాంతో మంటలు చెలరేగడంతో గుడిసెలోని సిలిండర్ పేలింది. బాణాసంచా ధాటికి గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పోలీసులు , జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
Read More: BRS: ప్రజల సొమ్ముతో రిచెస్ట్ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్