Summer Holidays: ఏప్రిల్ 24 నుంచి.. తెలంగాణలో పాఠశాలకు సెలవులు..!
- By HashtagU Desk Published Date - 11:48 AM, Thu - 31 March 22
ఏప్రిల్ 24 నుంచే తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ప్రారంభం కానున్నాయి. మే నెలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసిన అనంతరం ఎండాకాలం సెలవులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అయినప్పటికీ రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచే పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షా ఫలితాలను 23వ తేదీ లోగా రిలీజ్ చేయనున్నారు. ఆ మరుసటి రోజు నుంచే అంటే ఏప్రిల్ 24 నుంచే ఎండాకాలం సెలవులు ప్రారంభం కానున్నాయి. భారీగా పెరిగిన ఎండల కారణంగా ఇప్పటికే మొదలైన ఒంటిపూట బడులను కూడా గురువారం నుంచి ఉదయం 11.30 గంటలకు ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వెంటనే ఎండా కాలం సెలవులపైనా సర్కార్ ప్రకటన విడుదల చేసింది.