Muzaffarpur Fire: బీహార్ లో విషాదం .. నలుగురు అక్కాచెల్లెళ్లు సజీవ దహనం
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 02-05-2023 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
Muzaffarpur Fire: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులంతా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారని సమాచారం.
సోమవారం అర్థరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కొద్దిసేపటికే, మంటలు తీవ్ర రూపం దాల్చాయి. ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు అక్కాచెల్లెళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయారు. పక్క గదిలో నిద్రిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారిలో సోని (12), శివాని (8), అమృత (5), రీటా (3) ఉన్నారు. తండ్రి నరేష్ రామ్ వేరే రాష్ట్రంలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఐదుగురు కుమార్తెలు, చిన్న కుమారుడు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో తల్లి చిన్నారితో కలిసి ఇంటి బయట నిద్రిస్తోంది.
Read More: Goddess Kali: కాళిమాతపై వివాదాస్పద ఫోటో.. సారీ చెప్పిన ఉక్రెయిన్