Former India cricketer: టీమిండియా మాజీ ఆటగాడికి తప్పిన పెను ప్రమాదం.. మీరట్ లో ఘటన
భారత జట్టు మాజీ ఆటగాడు (Former India cricketer) ప్రవీణ్ కుమార్ మంగళవారం అర్థరాత్రి మీరట్ సిటీలో కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.
- By Gopichand Published Date - 10:02 AM, Wed - 5 July 23

Former India cricketer: భారత జట్టు మాజీ ఆటగాడు (Former India cricketer) ప్రవీణ్ కుమార్ మంగళవారం అర్థరాత్రి మీరట్ సిటీలో కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఆయన కారును వేగంగా వస్తున్న క్యాంటర్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్ (Praveen Kumar)తోపాటు అతని కుమారుడు కూడా కారులో ఉండడంతో ఇద్దరూ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడు క్యాంటర్ డ్రైవర్‌ను సంఘటనా స్థలం నుంచి పట్టుకున్నారు.
జూలై 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనంలో మీరట్‌లోని పాండవ్ నగర్ నుండి వస్తున్నాడు. ఆ తర్వాత వాహనం కమిషనర్ నివాసం సమీపంలోకి రాగానే ఆయన కారును క్యాంటర్ ఢీకొట్టింది. ఆ తర్వాత వాహనం బాగా దెబ్బతింది. కాగా ఈ ప్రమాదంలో ప్రవీణ్, అతని కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాంటర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రవీణ్ కుమార్, కుమారుడు పూర్తిగా క్షేమంగా ఉన్నారని సీఓ తెలిపారు. ప్రవీణ్ కుమార్ ఇల్లు మీరట్ సిటీ బాగ్‌పత్ రోడ్‌లో ఉన్న ముల్తాన్ నగర్‌లో ఉంది.
ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ కెరీర్
ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. ఒకప్పుడు అతను టీమ్ ఇండియాకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ప్రధాన బౌలర్ పాత్రను పోషించేవాడు. 2008లో ఆస్ట్రేలియాలో భారత జట్టు CB సిరీస్‌ను గెలుచుకున్నప్పుడు ప్రవీణ్ కుమార్ బంతితో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవీణ్‌కుమార్ భారత జట్టు తరుపున 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ప్రవీణ్ వన్డేల్లో 77, టీ20ల్లో 8, టెస్టుల్లో 27 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 119 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ప్రవీణ్ కుమార్ పేరిట 90 వికెట్లు నమోదయ్యాయి.