Irani Chai: హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్.. ఇరానీ ఛాయ్ రేటు పెరిగింది!
కప్పు ఛాయ్ తాగితే చాలు.. దెబ్బకు హుషారు తన్నుకొస్తుంది. టీ చేసే మ్యాజిక్ అదే! అందులోనూ ఇరానీ ఛాయ్ తాగితే.. ఆ కిక్కే వేరు.
- By Hashtag U Published Date - 11:56 AM, Fri - 25 March 22

కప్పు ఛాయ్ తాగితే చాలు.. దెబ్బకు హుషారు తన్నుకొస్తుంది. టీ చేసే మ్యాజిక్ అదే! అందులోనూ ఇరానీ ఛాయ్ తాగితే.. ఆ కిక్కే వేరు. అందుకే ఉదయాన్నే అలా బయటకు వెళ్లి ఏదైనా కేఫ్ లో ఒక కప్పు ఛాయ్ తాగడం చాలామందికి అలవాటు. కానీ ఇకపై వారు ఒక్కో కప్పు టీకి ఓ ఐదు రూపాయిలు ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. దీంతో ఇరానీ ఛాయ్ ప్రియులంతా.. తమకు టీ తాగిన కిక్కు కూడా ఉంచరా అని ఫీలవుతున్నారు.
నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతోపాటు టీ పౌడర్, పంచదార, పాల ధరలపైనా ప్రభావం పడింది. గ్యాస్ బండ బాదుడు వేరే చెప్పక్కరలేదు. దీంతో కప్పు ఛాయ్ తయారుచేయాలంటే చాలా ఖర్చవుతోందంటున్నారు వ్యాపారులు. పైగా దుకాణాల అద్దెలు కూడా పెరిగాయని.. దీనివల్ల ఖర్చులు పెరిగి రాబడి తగ్గిందని.. అందుకే ఇరానీ ఛాయ్ రేటు కూడా పెంచక తప్పలేదంటున్నారు.
ఇప్పటివరకు కప్పు ఇరానీ ఛాయ్ ఖరీదు రూ.15 ఉంది. కానీ ఇకపై అదే కప్పు ఇరానీ ఛాయ్ తాగాలంటే రూ.20 పెట్టాల్సిందే. చాలామందికి రోజుకు కనీసం రెండు మూడు ఛాయ్ లు తాగే అలవాటు ఉంటుంది. అంటే కేవలం ఛాయ్ ఖర్చే ఎలా లేదన్నా రోజుకు రూ.60 అవుతుంది. మొత్తంగా నెలకు దాదాపు రూ.1800 అవుతుంది. ఇది ఇంట్లో ఒకరి ఛాయ్ ఖర్చు మాత్రమే. దీనివల్ల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుందని.. ఛాయ్ ఇంత పని చేస్తుందని ఊహించలేకపోయామంటున్నారు.
కరోనా ప్రభావం హోటల్ రంగంపైనా పడింది. ఇరానీ ఛాయ్ పత్తా కేజీ రూ.300 నుంచి రూ.500కు చేరింది. ఇక ఇరానా ఛాయ్ చేయాలంటే కచ్చితంగా నాణ్యమైన పాలు ఉండాల్సిందే. ఇప్పుడు నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు కావాలంటే లీటరుకు రూ.100 అయినా పెట్టాలి. వాణిజ్య సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. కరోనా మహమ్మారి తరువాత నిర్వహణ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే పాత రేటుకు ఛాయ్ ని అమ్మలేమంటున్నారు.
ఇరానీ ఛాయ్ ని చేయాలంటే.. పాలు, టీ పొడి క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడకూదు. లేదంటే ఛాయ్ రుచిలో తేడా వచ్చేస్తుంది. అయినా సరే.. కప్పు ఛాయ్ కి రూ.20 పెట్టాలంటే సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు కష్టేమే అన్న అభిప్రాయం నెలకొంది.