EC Ban: ఐదు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం – ఈసీఐ
వచ్చే నెలలో జరగనున్న ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ర్యాలీలు,రోడ్ షోలపై నిషేధాన్ని జనవరి 31 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
- By Hashtag U Published Date - 10:15 AM, Sun - 23 January 22
వచ్చే నెలలో జరగనున్న ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ర్యాలీలు,రోడ్ షోలపై నిషేధాన్ని జనవరి 31 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు ఇతరులతో వర్చువల్ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కొన్ని సడలింపులను ఇచ్చింది. రాజకీయ పార్టీల బహిరంగ సభలు, ఫేజ్ 1 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు జనవరి 28 నుంచి ప్రచారానికి అనుమతి ఉంది. ప్రచారంలో గరిష్ఠంగా 500 మంది ఉండేలా.. బహిరంగ సభలో గ్రౌండ్ సామర్థ్యంలో 50 శాతం మంది ఉండేలా చూడాలని పేర్కొంది. ఫేజ్ 2 ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఫిబ్రవరి 1 నుంచి అనుమతి ఉంది. వీటిని గరిష్ఠంగా 500 మంది లేదా గ్రౌండ్ సామర్థ్యంలో 50 శాతం ఉండే నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని ఈసీఐ తెలిపింది.
ఇంటింటికీ ప్రచారం కోసం గరిష్ట సంఖ్యను ఐదు నుండి పదికి పెంచారు . రాజకీయ పార్టీలు వీటిని ఉలంఘిస్తే అధికారులు చర్యలు తీసుకోవాల్సి లేని పక్షంలో ఆ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్‌లను పాటించేలా చూసేందుకు ప్రధాన కార్యదర్శి లేదా జిల్లా మేజిస్ట్రేట్ వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఓటింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు 7 దశల్లో పూర్తవుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.