CSK: చెన్నై సూపర్ కింగ్స్ కు టెన్షన్
ఐపీఎల్ 2022 సీజన్ ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
- By Hashtag U Published Date - 02:32 PM, Tue - 22 February 22

ఐపీఎల్ 2022 సీజన్ ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా అటు శ్రీలంకతో టీ20 సిరీస్ పాటుగా ఇటు ఐపీఎల్ 15వ సీజన్ తొలి దశ మ్యాచులకు కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో దీపక్ చాహర్ గాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 1.5 ఓవర్లే బౌలింగ్ చేసిన దీపక్ చాహర్.. 2 కీలక వికెట్లను పడగొట్టాడు. కానీ.. ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో చివరి బంతిని బౌలింగ్ చేసే క్రమంలోచాహర్ తొడ కండరాలకి తీవ్ర గాయమైంది. దాంతో నొప్పితో విలవిల్లాడిన చాహర్ బంతిని వేయలేకపోయాడు. ఆ తరువాత టీమిండియా ఫిజియో వచ్చి పరిశీలించి చాహర్ ను మైదానం బయటికి తీసుకెళ్లాడు.. అయితే తొడ కండరాల గాయం నుంచి దీపక చాహర్ కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించాలంటే కనీసం 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో.. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటుగా ఐపీఎల్ తొలి దశ మ్యాచులకు కూడా దీపక్ చాహర్ దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక తొడ కండరాల గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి దీపక్ చాహర్ వెళ్లనున్నారు.. ఇదిలాఉంటే.. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్-2022 మెగా వేలంలో దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. బౌలింగ్ ఆల్ రౌండర్ గా దుమ్మురేపే చాహర్ గాయపడడంతో ఇప్పుడు చెన్నై జట్టులో కలవరం మొదలైంది.