IPL Covid: ఐపీఎల్ లో కరోనా కలకలం
స్వదేశంలో విజయవంతంగా సాగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ కు ఊహించని షాక్ తగిలింది.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది.
- By Naresh Kumar Published Date - 06:55 PM, Fri - 15 April 22

స్వదేశంలో విజయవంతంగా సాగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ కు ఊహించని షాక్ తగిలింది.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. బయో బబుల్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఫిజియో పాట్రిక్ ఫర్‌హార్ట్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం అతడిని క్వారంటైన్ కు పంపినట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరే ఇతర ఆటగాడికైనా కరోనా సోకిందేమోనన్న అనుమానంతో వైద్య బృందం టెస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీపడనుంది.
ఈ మ్యాచ్ కోసం ఆ జట్టు ఆటగాళ్లంతా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.ఇక ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్ పాయింట్ల పట్టికలో 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదేసి మ్యాచ్‌ల చొప్పున మూడేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. రెండేసి విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఒక గెలుపుతో చెన్నైసూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో, ఒక మ్యాచ్ లో కూడా విజయం సాధించని ముంబై ఇండియన్స్ పదో స్థానంలో నిలిచింది.