Sudan fighting: సుడాన్ లో ఇరుక్కున్న ఇతర దేశాల పౌరుల తరలింపు
సూడాన్ ప్రస్తుతం అంతర్యుద్ధంతో పోరాడుతోంది. సైన్యం మరియు పారామిలటరీ బలగాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలో, ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించారు
- By Praveen Aluthuru Published Date - 07:29 AM, Mon - 24 April 23

Sudan fighting: సూడాన్ ప్రస్తుతం అంతర్యుద్ధంతో పోరాడుతోంది. సైన్యం మరియు పారామిలటరీ బలగాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలో, ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించారు, 3500 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు ఇతర దేశాల ప్రతినిధులు తమ పౌరులని సురక్షితంగా వెనక్కి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఖార్టూమ్‌కు 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్ర సముద్రంలోని పోర్ట్ సుడాన్ నుండి తమ పౌరులను తరలించడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
సూడాన్‌లో చిక్కుకుపోయిన పౌరులను తరలించేందుకు భారత్ సన్నాహాలను పూర్తి చేసింది. భారత వైమానిక దళానికి చెందిన రెండు C-130J విమానాలు జెడ్డా (సౌదీ అరేబియా)లో మోహరించాయి. సుడాన్‌లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు సూడాన్ సంబంధిత అధికారులతో టచ్‌లో ఉండగా మరోవైపు అధికారుల బృందం మొత్తం సూడాన్ చుట్టూ ఉన్న దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. పౌరుల తరలింపు భద్రతా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని మంత్రిత్వ శాఖ చెబుతోంది.
సౌదీ అరేబియా తమ దేశ పౌరుల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే నౌకాదళ ఆపరేషన్‌లో పోర్ట్ సూడాన్ నుండి విదేశీ దౌత్యవేత్తలు మరియు అధికారులతో సహా 150 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించింది. సౌదీ అరేబియా తన 91 మంది పౌరులను మరియు కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ట్యునీషియా, పాకిస్తాన్, ఇండియా, బల్గేరియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, కెనడా మరియు బుర్కినా ఫాసో నుండి 12 ఇతర దేశాల నుండి 66 మంది పౌరులను తరలించింది.
ఖార్టూమ్ నుండి యుఎస్ ఎంబసీ సిబ్బందిని తరలించడానికి యుఎస్ మిలిటరీ ఆదివారం మూడు చినూక్ హెలికాప్టర్లను పంపింది. భద్రతా ప్రమాదాల కారణంగా ఇప్పటికే వందల మంది మరణించారు. మరియు వేలాది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సూడాన్‌ను విడిచిపెట్టాలని సిబ్బందిని మరియు వారి కుటుంబాలను ఆదేశించినట్లు US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.
ఇక ఫ్రాన్స్ తమ పౌరుల్ని తమ దేశానికి తీసుకెళ్తుంది. దాదాపు 100 మందిని సుడాన్ నుంచి విమానంలో రప్పించినట్లు ఫ్రెంచ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు.
Read More: CSK vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం