Sugar Factories: తెలంగాణలో చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
- Author : Balu J
Date : 05-02-2024 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
Sugar Factories: రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఇటీవల డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది.
బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం అన్నారు.
చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.