Gas Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!
- Author : HashtagU Desk
Date : 01-03-2022 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. వంటగ్యాస్ (డొమెస్టిక్) కు మాత్రం మినహాయింపు ఇచ్చిన చమురు సంస్థలు, వాణిజ్య సిలిండర్ వినియోగా దారులకుకు పెద్ద షాకే ఇచ్చారు. ఈ క్రమంలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ పై 105 రూపాయలు పెంచుతూ చమురు కంపెనీలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా 2వేలు దాటింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను కూడా 27 రూపాయలు పెంచాయి. కొత్త ధరలు మార్చి 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.
ఇక కమర్షియలల్ సిలిండర్ పెరిగిన నేపధ్యంలో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 2,012 రూపాయలకు చేరగా, కోల్‌కతాలో రూ.2,089, ముంబయిలో రూ.1962, చెన్నైలో రూ.2,185.5గా ఉంది. ఇక 5 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో 569 రూపాయలకు చేరింది. ఫిబ్రవరి 1నే వాణిజ్య సిలిండర్‌పై రూ.91.50 తగ్గించగా.. సరిగ్గా నెల రోజులకు రూ.105 పెంచడం గమనార్హం. హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ వాణిజ్య సిలిండర్లు వాడుతుంటారు. వీటి ధర పెరగడంతో బయట కొనుగోలు చేసే ఆహార పదార్థాల ధరలు కూడా పెరగనున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత ధరల ప్రకారం 14.2 కిలోల సిలిండర్ ఢిల్లీ, ముంబయిలో 899.5 రూపాయలకు లభిస్తోంది. కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.915.5, హైదరాబాద్‌లో 952 రూపాయలుగా ఉంది.