AmmaVadi : మూడో విడత అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
- Author : Prasad
Date : 27-06-2022 - 2:03 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీకాకుళం నగరంలోని కేఆర్ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో దశ అమ్మఒడి నిధులను విడుదల చేశారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం ల్యాప్‌టాప్‌లోని డిజిటల్ కీని నొక్కి ఆన్‌లైన్ విధానంలో సీఎం ఆ మొత్తాన్ని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 43, 96, 402 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.6,595 కోట్లు జమ చేయబడ్డాయి. 80 లక్షల మంది పాఠశాల మరియు కళాశాలలకు వెళ్లే పిల్లలకు ప్రయోజనం చేకూరింది. బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 12,000/- విలువైన ట్యాబ్‌లు ఈ విద్యా సంవత్సరం నుండి ఇస్తామన్నారు. 75 శాతం హాజరు కారణంగా అమ్మ ఒడి జాబితా నుంచి 51 వేల మంది తల్లుల పేర్లను తొలగించడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి సంవత్సరం ఈ షరతు సడలించామని.. రెండవ సంవత్సరం కోవిడ్ కారణంగా మినహాయింపు ఇచ్చామన్నారు. అయితే ఇది మూడవ సంవత్సరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో క్రమశిక్షణను పెంపొందించడానికి తాము ఈ షరతు విధించామని సీఎం జగన్ తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అమ్మ ఒడి మొత్తం నుండి 2,000/- తగ్గించామని తెలిపారు.