Bhatti: యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే!
తెలంగాణలో యాసంగిలో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- By Balu J Published Date - 11:13 AM, Sat - 12 March 22

తెలంగాణలో యాసంగిలో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కొనుగోలు చేయడంలేదన్న నెపంతో ధాన్యం కొనుగోలు చేయమనడం సరికాదన్నారు. కేంద్రంపై యుద్దం ప్రకటిస్తూనే తెలంగాణ రైతులను ఆదుకోవడానికి కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు బంధు పథకం తోపాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆనేక పథకాలను కొనసాగించాలని కోరారు. రైతు బంధు ఇస్తున్నామని రైతులకు ఇవ్వాల్సిన ఆనేక రాయితీలు, ప్రోత్సహాకాలను బంద్ చేయకుండ కొనసాగించాలని కోరారు. పాలిహౌజ్, డ్రిప్, స్ప్రేయర్స్ ఇలా వ్యవసాయ యంత్ర పరికారాలను ఇవ్వాలన్నారు. పందిరి సాగు కోసం లక్ష నుంచి 5లక్షల వరకు సాయం చేయాలని కోరారు. పావల వడ్డీ రుణాలు రూ.3లక్షల వరకు ఇవ్వాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.
వ్యవసాయ క్షేత్రాలకు అధికారులను పంపించి భూ సార పరీక్షలు చేయించి ఆభూమికి అనువుగా పంటలు వేయించాలని, ఇందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నకిలి విత్తనాలను మార్కెట్లోకి రాకుండ కట్టడి చేయాలని కోరారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో తన పాధయాత్ర సందర్భంగా ఒక ఊరిలో రైతులు సాగు చేసిన మొక్క జొన్న నకిలి విత్తనాలతో ఆఊరిలో వేసిన పంట మొత్తం దెబ్బతిన్నదని సభ ద్రుష్టికి తీసుకువచ్చారు. పత్తి, మిర్చి రైతులు సైతం నకిలి విత్తనాలతో దిగుబడి రాక నష్టపోయారని తెలిపారు. నకిలి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా పూర్తిగా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సును ఇంటర్మీడియేట్‌తో సమానంగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 45 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు ఫించన్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు అమలు కావటంలేదు. ఎప్పటి నుంచి ఇస్తారో సభ వేదికగా చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఫించన్ ఇవ్వాలని కోరారు. అదే విధంగా తాటి వనాల పెంపకం కోసం ఐదు ఎకరాల స్థలం సొసైటీలకు ఇస్తామని చెప్పి పంపిణీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కడానికి ఎలక్ట్రిక్ మోకులు ఇవ్వాలన్నారు. నీర ఉత్పత్తులను ప్రోత్సహించి హైదరాబాద్‌లో విక్రయ కేంద్రం ప్రారంభిస్తే కల్తీ కల్లుకు సైతం చెక్ పెట్టినవారవుతారని తెలిపారు.