Chicken Price: కొండెక్కిన కోడి.. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..!
- Author : HashtagU Desk
Date : 08-03-2022 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
కోడి కొండెక్కింది.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 20 రోజుల క్రితం కిలో కోడి మాంసం 175 రూపాయలు ఉండగా, తాజాగా 280 రూపాయలుకి పెరిగింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 100 రూపాయలు పెరిగింది. ఇకముందు కూడా చికెన్ రేట్లు పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఇక తెలంగాణలో రోజుకు సగటును 10లక్షల కిలోల కోడి మాంసం అమ్ముతున్నట్టు తెలుస్తోంది. గత పది రోజుల నుండి అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు పెరిగాయని సమాచారం. ఇలా ధరలు పెరిగేందుకు ప్రధాన కారణం వాతావరణ మార్పు అని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
శీతకాలం ముగిసి వేసవి రావడం, వాతావరణంలో వేడి పెరిగిపోవడంతో ఆ ఉష్ణోగ్రతలకు కోడి పిల్లలు ఎక్కువగా చనిపోతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా కోడి పిల్లలకు దాణాగా వేసే సోయాచెక్క, మొక్కజొన్న, ఇతర ధాన్యపు గింజల ధరలు కూడా పెరిగిపోవడంతో మాంసం ధరలు కూడా పెరిగిపోయాయి. ఎండలు ఇంకా ముదిరి కోళ్ల మరణాలు పెరిగితే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు నాటుకోడి మాంసం ధర కూడా కిలో 400 నుంచి 500 రూపాయలు పెరిగింది. నాటుకోళ్ల లభ్యత తక్కువగా ఉండటంతో రేట్లను పెంచుతున్నారని చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి చికెన్ ధరలు భారీగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ కిలో 350 నుంచి 400 వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని లేదని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా చికెన్ ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.