Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోందా.. ఇకపై వారానికి ఐదు రోజులేనా?
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే బ్యాంకు ఉద
- By Anshu Published Date - 05:19 PM, Thu - 4 May 23

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే బ్యాంకు ఉద్యోగులు పనిచేసేలా కేంద్ర ఆర్థిక శాఖ అతి త్వరలోనే అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు భారత బ్యాంకుల సంఘం ఐబీఏ కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపిందట. అయితే ఈ అంశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉండగా త్వరలోనే దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు వేజ్ బోర్డు సవరణలు చేసి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సదరు మీడియా కథనాలు తెలిపాయి.కాగా కరోనా మహమ్మారి సమయంలో వారానికి కేవలం ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు డిమాండ్ చేశాయి. అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఇందుకు తిరస్కరించి వేతనంలో 19 శాతం పెంచుతామని ఆఫర్ చేసింది. కానీ అందుకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంగీకరించలేదు.
తమకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడంతో పాటు పింఛను, ఇతర డిమాండ్ లతో ఈ ఏడాది జనవరిలో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సమ్మెను వాయిదా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకు యూనియన్లతో ఐబీఏ చర్చలు జరిపింది. వారానికి ఐదు రోజుల పని విధానం డిమాండ్‌ను తాము పరిగణనలోకి తీసుకుంటామని ఐబీఏ తెలిపింది. అయితే అందుకు బదులుగా ఉద్యోగుల రోజువారీ పనిగంటలను 40 నిమిషాలు పెంచుతామని పేర్కొనగా అందుకు బ్యాంకు యూనియన్లు మాత్రం అంగీకరించడంతో ఐబీఏ తాజాగా ఐదు రోజుల పనిపై కేంద్రానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇది కనుక అమల్లోకి వస్తే.. బ్యాంకు ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుంది.