Mirchi Price: కొనలేం, తినలేం.. కిలో పచ్చిమిర్చి రూ.120
కిలో పచ్చిమిర్చి రూ.120కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో
- By Hashtag U Published Date - 05:53 PM, Tue - 27 June 23

పచ్చిమిర్చి, టమోటా, అల్లం.. ధరలు ఇలా ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యుడితో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
ధరలు పెరగడంతో టమాటా, పచ్చిమిర్చిలను సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగానే పంట దిగుబడులు తగ్గి టమాటా, పచ్చి మిర్చి ధరలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా మామూలుగా జూన్ ఆరంభంలో వర్షాలు కురిసేవి.
అయితే ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా పంటల దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈసారి టమాటా దిగుబడి బాగా తగ్గింది. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లెకు చాలా తక్కువగా టమాటాలు వస్తున్నాయి. దీంతో టమాటాల కొనుగోలుకు వ్యాపారులు పోటీపడుతుండటంతో ధరలు పెరిగాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా, పచ్చిమిర్చి కొంతమేర సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పలు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.
Also Read: Jr NTR Emotional: శ్యామ్ మరణం చాలా బాధాకరమైంది, జూనియర్ ఎన్టీఆర్ ఎమోషన్