పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్.. 32 మంది మృతి, 150మంది గాయాలు!
సోమవారం పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో ప్రార్దనలు జరుగుతుండగా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు
- By Balu J Published Date - 07:09 PM, Mon - 30 January 23

Pakistan Bomb Blast: సోమవారం పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో ప్రార్దనలు జరుగుతుండగా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 32 మంది మరణించినట్టు మరో 150 మంది తీవ్ర గాయాలపాలైనట్టు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఆత్మాహుతి బాంబు దాడి జరిగినప్పుడు దాదాపు 200 మంది మసీదులో ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, ఆత్మాహుతి బాంబర్ బాంబులతో కూడిన తన చొక్కాను పేల్చాడు. సమీపంలోని పోలీసు స్టేషన్‌ల నుండి చాలా మంది పోలీసులు, స్థానికులు కూడా మసీదు లోపల ప్రార్థనలు చేస్తున్నారు.
పేలుడు కారణంగా, మసీదు పైకప్పు కూలిపోయి పడిపోయింది. ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటన చేయలేదు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్షతగాత్రులలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ దాడికి పాకిస్తానీ తాలిబన్ సంస్థ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు గతంలో ఇలాంటి బాంబు దాడులకు పాల్పడ్డారు.