Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది : కిషన్ రెడ్డి
- By Balu J Published Date - 06:16 PM, Tue - 26 December 23

Kishan Reddy: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ సీట్ల సంఖ్యను రెండంకెలకు చేరుస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని, అయితే రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి రానున్న కాలంలో పార్టీకే ఓటు వేస్తారని స్పష్టం చేశారు.
“అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మా అంచనాలకు అందనప్పటికీ, గత ఎన్నికలతో పోలిస్తే మా ఓట్ల వాటాను 6.8 శాతం నుండి 14 శాతానికి రెట్టింపు చేయగలిగాము. ఒక సీటు నుంచి ఎనిమిది సీట్లకు చేరుకున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
బిజెపి నాయకత్వం 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. రాష్ట్రాలకు 90 రోజుల ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. తదనుగుణంగా పార్టీ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి తెలంగాణలో పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయడానికి ప్రతిదీ ప్లాన్ చేస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తమ కార్యకర్తలను సిద్ధం చేసేందుకు తెలంగాణలో పార్టీ ఇప్పటికే జిల్లాల్లో సమీక్షా సమావేశాలను ప్రారంభించిందని అన్నారు.