Anand Mohan: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదల
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ (Anand Mohan) అనేక నిరసనల మధ్య గురువారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు విడుదలైనా ఆనంద్ మోహన్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు.
- Author : Gopichand
Date : 27-04-2023 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ (Anand Mohan) అనేక నిరసనల మధ్య గురువారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు విడుదలైనా ఆనంద్ మోహన్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. తన విడుదలకు సంబంధించి జైలు నిబంధనలను మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఓ సామాజిక కార్యకర్త పాట్నా హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. బీహార్ జైలు నిబంధనలు, 2012లోని 481 (i) (a) నియమం ప్రకారం ‘ప్రభుత్వ సేవకుడిని హత్య చేసినందుకు’ బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పాట్నా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయబడింది.
సామాజిక కార్యకర్త అమర్ జ్యోతి తన న్యాయవాది అల్కా వర్మ ద్వారా ఈ పిల్ దాఖలు చేశారు. బీహార్ జైలు నిబంధనలు.. 2012లోని రూల్ 481 (i) (a)లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ శాంతిభద్రతలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను, సాధారణ ప్రజలను నిరుత్సాహపరుస్తుంది అని పేరొన్నారు.
రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ గురువారం ఉదయం సహర్సా జైలు నుండి విడుదలయ్యారు. ఆయనను ప్రభుత్వం శాశ్వతంగా విడుదల చేసింది. గతంలో తన కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థం సందర్భంగా పెరోల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈలోగా ఆయనను పూర్తిగా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పెరోల్ ముగిసిన తర్వాత బుధవారం ఆనంద్ మోహన్ జైలుకు వెళ్లాడు.
1994లో బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి విడుదల చేస్తూ బీహార్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.