Belt Shop : బెల్టు షాపు ఈ రేంజ్ లో కొట్టుకోవాలా తమ్ముళ్లు..?
Belt Shop : త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో బెల్ట్ షాప్ స్థాపనను చుట్టూ తలెత్తిన వివాదం చివరకు భౌతిక దాడుల దాకా వెళ్లింది
- Author : Sudheer
Date : 17-04-2025 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రకాశం జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో బెల్ట్ షాప్ స్థాపనను చుట్టూ తలెత్తిన వివాదం చివరకు భౌతిక దాడుల దాకా వెళ్లింది. పార్టీలో అధిపత్య పోరుతో నాయకులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేయడం, పదిమందికి పైగా తీవ్రంగా గాయపడటం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ ఘటనకు మూలకారణం యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మన్నే రవీంద్ర వర్గం మరియు పార్టీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గం మధ్య జరిగిన స్వాధీన పోరు. బెల్టు షాప్ ల ద్వారా వచ్చే ఆదాయం పై రెండూ వర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. ఈ క్రమంలో జరిగిన పరస్పర దాడుల్లో రవీంద్ర భార్య మాధవి, బామ్మర్ది సహా పలువురికి గాయాలయ్యాయి. ప్రతిగా రవీంద్ర వర్గం దాడికి దిగడంతో ఎరిక్షన్ వర్గానికి చెందిన ముగ్గురు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
ఈ దాడులు టీడీపీకి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని మిగిలించాయి. పార్టీ నిబంధనలు పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కార్యకర్తలు తలపెట్టిన ఈ చర్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. బహిరంగంగా జరిగిన ఈ ఘర్షణ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసినదని, ప్రజల నమ్మకాన్ని కోల్పోవచ్చని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, సీఎం వ్యక్తిగతంగా జోక్యం చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.