Odisha Train Accident: రైలు ప్రమాదంలో 291కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్లో ఈ రోజు ఒకరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్ నివాసి ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం మృతి చెందాడు.
- By Praveen Aluthuru Published Date - 06:08 PM, Sat - 17 June 23

Odisha Train Accident: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్లో ఈ రోజు ఒకరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్ నివాసి ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం మృతి చెందాడు. దీంతో ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 291కి చేరింది. ఈ విషయాన్నీ సంబంధిత అధికారులు దృవీకరించారు. చనిపోయిన ప్రయాణికుడిని బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రోషన్‌పూర్‌కు చెందిన సాహిల్ మన్సూర్ గా గుర్తించారు. అతని వయసు 32 సంవత్సరాలు. కాగా చనిపోయిన ఆ యువకుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతను ప్రస్తుతం డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా రోగి మరణించాడని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాన్సు శేఖర్ మిశ్రా తెలిపారు.
ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 205 మంది క్షతగాత్రులలో 46 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 13 మంది ఐసియులో ఉన్నారని మిశ్రా చెప్పారు. ఐసీయూలో ఉన్న 13 మంది క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా నిన్న శుక్రవారం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని పాత్ర గ్రామానికి చెందిన ప్రకాష్ రామ్ (22) వలస కూలీ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించాడు. మంగళవారం తెల్లవారుజామున బీహార్‌కు చెందిన బిజయ్ పాశ్వాన్ అనే ప్రయాణికుడు కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మరణించాడు.
జూన్ 2న జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో 287 మంది అక్కడికక్కడే మరణించగా 1,208 మంది గాయపడ్డారు. షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు ఒక గూడ్స్ ఈ మూడు రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో గూడ్స్ రైలు ఆగి ఉన్నది.
Read More: Thalapathy Vijay: రాజకీయాల్లోకి విజయ్ దళపతి, తమిళనాడు లక్ష్యంగా పొలిటికల్ స్పీచ్!