Manja: దారుణం.. బైక్ పై వెళ్తున్న పాప మెడను కోసేసిన చైనా మాంజా!
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చాలా మంది గాలిపటాలను ఎగురవేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు.
- By Anshu Published Date - 09:39 PM, Fri - 13 January 23

Manja: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చాలా మంది గాలిపటాలను ఎగురవేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇక పెద్దలు కూడా పోటీ పడి మరీ ఈ గాలిపటాలను ఎగురవేస్తుంటారు. అయితే గాలిపటాల దారాలు ఎక్కువగా తెగిపోతుంటాయి. కొందరికి నూలు దారాలతో ఉన్న గాలిపటాలు వాడటం అస్సలు ఇష్టం ఉండదు.
గాలిపటాల పందేలు పెట్టుకున్నప్పుడు కొందరు ఎదుటివారి గాలిపటాల దారాలను తెంచేయాలని చూస్తుంటారు. అందుకోసమే వారు ఎక్కువగా చైనా మంజాలను ఉపయోగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఈ చైనా మాంజాల వాడకం ఎక్కువయ్యింది. ఇవి సాధారణంగా ఉన్న దారాలను సులభంగా తెంపేయగలవు. అందుకే చాలా మంది వీటిని అమ్ముతూ ఉంటారు.
తాజాగా ఈ చైనా మంజా వల్ల ఓ చిన్నారి ప్రాణం పోయే పరిస్థితి తెచ్చింది. చైనా మంజా ఒక చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. తన తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారి మెడకి మంజా చుట్టుకుని తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన తండ్రి పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె ప్రాణాలతో బయటపడింది.
హైదరాబాద్‌లోని నాగోల్ ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా మంజాపై నిషేధం వున్నప్పటికీ చాలా మంది నగరంలోని రోడ్లపై బహిరంగంగా దీనిని విక్రయిస్తూ ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకు ఈ చిన్నారి ఆసుపత్రి పాలవ్వడం పలువురికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పోలీసులు స్పందించి నగరంలో చైనా మాంజా అమ్మకుండా దాడులు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉంది.