Army Jawan Died : లద్దాఖ్ ప్రమాదంలో తెలంగాణ జవాన్ మృతి
లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడింది
- By Sudheer Published Date - 09:15 AM, Mon - 21 August 23

దేశ రక్షణలో మరో జవాన్ ప్రాణం (Army Jawan Died) పోయింది. లద్దాఖ్ (Ladakh ) లో శనివారం జరిగిన ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన జవాన్ చంద్రశేఖర్ (Army Jawan chandrashekhar) (30) కన్నుమూశారు. ఈనెల 19 న లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మరణించారు. మరణించిన తొమ్మిది మంది సైనికుల్లో జవాన్ చంద్రశేఖర్ ఉన్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
తిర్మన్‌దేవునిపల్లికి చెందిన మల్లయ్య, శివమ్మ దంపతుల ముగ్గురు సంతానంలో చంద్రశేఖర్ చిన్నవాడు. కొందుర్గులోని బీసీ సంక్షేమ హాస్టల్ లో టెన్త్ వరకు చదివాడు. అనంతరం చంద్రశేఖర్ 2011లో సైన్యంలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం లేహ్ జిల్లాలో తోటి సైనికులతో కలిసి ప్రయాణిస్తుండగా వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఆయన కుమారుడిని బడిలో చేర్పించేందుకు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారంటూ ఆయన భార్య లాస్య కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పార్థివదేహం సోమవారం గ్రామానికి చేరుకోవచ్చని మాజీ సర్పంచి రామకృష్ణ తెలిపారు.
Read Also : Telangana: హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ ధీమా