Arjuna Ranatunga: లంక క్రికెటర్లూ ఐపీఎల్ వీడి స్వదేశానికి రండి : రణతుంగ
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఇప్పటికే ఆహార , రాజకీయ సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న లంక తాజాగా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది. దివాలా తీసినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
- By Naresh Kumar Published Date - 11:16 PM, Tue - 12 April 22

శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఇప్పటికే ఆహార , రాజకీయ సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న లంక తాజాగా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది. దివాలా తీసినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు విలవిలలాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలువురు ప్రముఖులు లంకలో తాజా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్వదేశంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తమ ఆటగాళ్ళు ఐపీఎల్ సీజన్ ఆడుతుండడంపై లంక మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు అర్జున రణతుంగ తప్పుబట్టారు. ఈ క్రమంలో వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్‌లో పాల్గొంటున్న శ్రీలంక ఆటగాళ్లంతా తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొనాలని కోరారు. అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతుంటే, తమ క్రికెటర్లు మాత్రం ఏం సంబంధం లేదన్నట్టు ఐపీఎల్‌లో పాల్గొంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆ క్రికెటర్లంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ కాంట్రాక్టులు పోతాయని భయపడుతున్నట్టు కనిపిస్తోందని రణతుంగ ఆరోపించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ దేశ మంత్రిత్వ శాఖ అధ్యర్యంలోనే ఉంటుంది. దీంతో అందులోని వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికే వారు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా లంక క్రికెటర్ల తీరుపై రణతుంగ తీవ్రస్థాయిలో మండిపడడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సమయం మించి పోలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని శ్రీలంక ఆటగాళ్లను అర్జున రణతుంగ కోరారు. ఇప్పటికే అనేక మంది యువ క్రికెటర్లు ఆందోళనల్లో పాల్గొంటున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్స్ కూడా రావాలని కోరారు. గతంలో వనిందు హసరంగ, బానుక రాజపక్స వంటి నిరసనలకు మద్దతుగా నిలిచారని, అయితే ఇప్పుడు ఐపీఎల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న అందరి ఆటగాళ్ల పేర్లను తాను చెప్పదలుచుకోలేదని రణతుంగ వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌లో శ్రీలంక చెందిన వానిందు హసరంగా, భానుక రాజపక్స, దుష్మంత చమీర, చమికా కరుణరత్నే, మహేశ్ తీక్షణ ఆయా జట్లలో ఆడుతున్నారు. అలాగే కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, లసిత్ మలింగ వంటి ఆటగాళ్లు పలు జట్ల కోచింగ్ బృందలో పని చేస్తున్నారు.
మరోవైపు ఈ నిరసనల్లో తానెందుకు పాల్గొనడం లేదనే అంశంపై కూడా రణతుంగా స్పష్టత ఇచ్చారు. తాను 19 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కానీ ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు పార్టీలకు అతీతంగా ప్రజలే చేస్తున్నారని అన్నారు. ఏ రాజకీయ నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొనడంలో లేదని అందుకే తాను కూడా దూరంగా ఉంటున్నట్లు అర్జున రణతుంగ చెప్పారు.