AP : గ్రామ పంచాయతీ ఉపఎన్నికల ఫలితాలు..సైకిల్ స్పీడ్ పెరిగింది
శనివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవ్వగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు
- By Sudheer Published Date - 07:32 PM, Sat - 19 August 23

ఏపీలో త్వరలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అధినేతలు వరుస పర్యటనలు , సమావేశాలు చేస్తూ..ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తర్వాత చనిపోయిన వారి స్థానాలకు శనివారం ఉపఎన్నికలు (AP Panchayat By-Elections Results) జరిగాయి. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు ఈ ఎన్నిక జరిగింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవ్వగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. ఈ ఫలితాల్లో టీడీపీ – కాంగ్రెస్ పార్టీ లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. అలాగే జనసేన నుండి కూడా పలువురు బరిలోకి దిగారు.
ఫలితాలు చూస్తే (AP Panchayat By-Elections Results)..
బాపట్ల జిల్లాలోని పర్చూరు పావులూరు గ్రామ సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు విజయం సాధించారు. పాడేరు నియోజకవర్గం సీలేరు, హిందూపురం నియోజకవర్గం చలివెందుల గ్రామ పంచాయతీ సర్పంచ్‌లుగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.
గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో భారీ మెజార్టీతో టీడీపీ సర్పంచ్ గెలుపొందారు. గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో అధిక సంఖ్యలో టీడీపీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు విజయం సాధించారు. సింగరాయకొండ మండలం పాకలలో టీడీపీ మద్దతు అభ్యర్థి సైకం చంద్రశేఖర్ సర్పంచ్‌గా విజయం సాధించారు.
నెల్లూరులోని మనుబోలు మండలం,బండేపల్లి మూడో వార్డులో ఒక్క ఓటుతో వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి ఆవుల పొలమ్మ విజయం సాధించింది. ఏలూరులోని దెందులూరు మండలం,కొవ్వలి గ్రామంలో జరిగిన 11వ వార్డు ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు మండలం ఎర్రమాడు ఉప ఎన్నికలో ఏడో వార్డు అభ్యర్థిగా వైసిపి బలపరిచిన చలివేంద్ర హరిబాబు విజయం సాధించారు
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని గండిగుంట గ్రామంలో పదో వార్డుకు జరిగిన ఉపఎన్నికలో టీడీపీ బలపరిచిన వీరంకి పాండురంగారావు 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నెల్లూరుజిల్లాలోరాపూరు మండలం పులిగిలపాడులో వార్డు ఎన్నికలో టీడీపీ బలపరిచిన నిమ్మల రాజమ్మ వైసిపి మద్దతుదారుపై 23 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జలదంకి మండలం వేములపాడు 7వ వార్డును టిడిపి బలపరిచిన పొట్లూరి ఆదిలక్ష్మి 34 ఓట్ల మెజార్టీతో సొంతం చేసుకున్నారు. కొండాపురం మండలం సాయిపేట 3వ వార్డులోటిడిపి మద్దతుదారు సానంంగుల రవి 65 ఓట్ల తేడాతో గెలుపొందారు. చేజర్ల మండలం పాతపాడు ఐదో వార్డు ఎన్నికలో టిడిపి, వైసిపి మద్దతుదారులిద్దరికీ.. సమానంగా 32 ఓట్లు వచ్చాయి.
అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం లింగరాజుపాలె 5వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో టిడిపి మద్దతుదారు కుప్పలా నాగనూక గౌరి 11 ఓట్ల తేడాతో గెలుపొందారు. చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో జరుగుతున్న ఒకటో వార్డు ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బాదర్ సింగ్ గారి బాలాజీ సింగ్ వైసీపీ అభ్యర్థిపై 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓవరాల్ గా ఈ ఉప ఎన్నికల్లో గతంతో పోలిస్తే సైకిల్ స్పీడ్ పెరిగినట్లు స్పష్టం అవుతుంది.
Read Also : Andhra Politics: నన్ను బలిపశువుని చేసిన పార్టీ ఏదో అందరికీ తెలుసు