Cyclone Michaung : మిచౌంగ్ తుపాను దృష్ట్యా అప్రమత్తమైన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్వోలకు ఆరోగ్య కుటుంబ
- By Prasad Published Date - 08:58 PM, Sun - 3 December 23

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్వోలకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన అన్ని ముందస్తు చర్యల్ని తీసుకోవాలని, మారుమూల ప్రాంతాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లలో సరిపడా మందుల్ని ముందుగానే నిల్వ చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అదే విధంగా ఈవారంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను ముందుగానే సమీప ఆసుపత్రులకు తరలించాలన్నారు. పాము కాటు చికిత్సకు అవసరమైన యాంటీ వీనం ఇంజక్షన్లను అన్ని పీహెచ్సీల్లోనూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని, వైద్య ఆరోగ్య సిబ్బంది హెడ్ క్వార్టర్లలో అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తూ ఉండాలని, నీటి నాణ్యత, సీజనల్ వ్యాధులు, డయేరియాను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఎటువంటి సాయం కావాలన్నా తక్షణమే రాష్ట్ర కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఉండాలి నివాస్ తన ఆదేశాలలో పేర్కొన్నారు.
Also Read: Telangana : గాంధీభవన్‌లో టీడీపీ జెండాలతో సంబరాల్లో పాల్గొన్న తెలుగు తముళ్లు