CM Jagan: జగన్ పాలనకు ‘ఐరాస’ అవార్డు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోని సంస్కరణలను ఐక్యరాజ్యసమితి మెచ్చుకుంది.
- Author : CS Rao
Date : 05-05-2022 - 12:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోని సంస్కరణలను ఐక్యరాజ్యసమితి మెచ్చుకుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం ఆయన చేసిన వినూత్న ఆలోచనలను ప్రశంసించింది. ఏపీ సర్కార్ అమలు చేస్తోన్న రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) పనితీరు భేష్ అంటూ ఐరాస అవార్డును ప్రకటించింది. ఆ విషయాన్ని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంస్కరణల కంటే జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని కేంద్రం భావించింది. ఆ మేరకు అంతర్జాతీయ స్థాయి అవార్డుకు ఆర్బీకేలను ఎంపిక చేసింది. రెండేళ్లుగా రైతుల కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల పనితీరు అంతర్జాతీయ స్థాయి అవార్డులకు నామినేట్ అయింది.
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) అవార్డులకు రైతు భరోసా కేంద్రాలు నామినేట్ కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్బీకేలను సీఎం జగన్ తీసుకొచ్చారని కాకాని అన్నారు. రెండేళ్లలోనే దేశం గర్వించే ఫలితాలను సాధించారని పేర్కొన్నారు. అన్నదాతలకు మేలు చేసేందుకు 10,700 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదని మంత్రి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. ఆ విషయాన్ని ఐక్యరాజ్యసమితి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అవార్డును చూసిన తరువాతైన జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని ప్రతిపక్షానికి హితవు పలికారు.