Manchu Mohan Babu : నేడు తిరుపతి కోర్టులో హాజరుకానున్న సినీనటుడు మోహన్‌బాబు
- Author : Prasad
Date : 28-06-2022 - 9:33 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు నేడు తిరుపతి కోర్టుకు హాజరుకానున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది. అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసి నాయుడు, పీఆర్వో సతీష్ లపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసులు నమోదు చేశారు. రోడ్డు పైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తు పోలీస్ అనుమతి లేదని, 341, 171(ఎఫ్), పోలీస్ యాక్ట్ 290 కింద వీరి పై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేడు తిరుపతి కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరగనుంది.