Amusement Park Accident: అమ్యూజ్మెంట్ పార్క్లో విరిగిన రాడ్.. ప్రాణ భయంతో అరుపులు!?
ఎంజాయ్ చేద్దామని వెళితే ప్రాణాల మీదకు వస్తే ఎలా ఉంటుంది. కాసేపు చిల్ అవుదాం, కాసేపు అడ్వెంచర్ గేం ఆడదామని అనుకున్న కొంతమంది ప్రాణాలు కాసేపు గాలిలో వేలాడాయి.
- Author : Anshu
Date : 20-01-2023 - 9:56 IST
Published By : Hashtagu Telugu Desk
Amusement Park Accident: ఎంజాయ్ చేద్దామని వెళితే ప్రాణాల మీదకు వస్తే ఎలా ఉంటుంది. కాసేపు చిల్ అవుదాం, కాసేపు అడ్వెంచర్ గేం ఆడదామని అనుకున్న కొంతమంది ప్రాణాలు కాసేపు గాలిలో వేలాడాయి. ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టి.. చివరకు పది నిమిషాల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఒకటి చైనాలో చోటుచేసుకుంది. అమ్యూజ్మెంట్ పార్కులో జరిగిన ఈ భయం గొల్పే ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చైనాలోని అన్ హుయ్ ప్రావిన్స్ లోని పుయాంగ్ నగరంలోని అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అక్కడికి చాలామంది విజిటర్లు వస్తుంటారు, పోతుంటారు. అక్కడి అమ్యూజ్మెంట్ పార్కులోని పలు అడ్వెంచర్ గేములను ఆసక్తి ఉన్న వాళ్లు ఆస్వాదిస్తుంటారు. కాస్త భయంగా ఉన్న వాళ్లు మాత్రం వేరే వాళ్లను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కాస్త గుండె గట్టిగా ఉన్న వాళ్లు ధైర్యం చేసి అక్కడ ఏర్పాటు చేసిన వాటిని ఎక్కుతుంటారు.
అలా పుయాంగ్ నగరంలోని అమ్యూజ్మెంట్ పార్క్ లోని ఓ పెండ్యులంని కొంతమంది ఎక్కారు. కాసేపు అది చక్కగానే పని చేసింది. కానీ కాసేపటి తర్వాత మాత్రం పెండ్యులం రాడ్ విరిగిపోయింది. దీంతో పెండ్యులం ఎక్కిన వారు గాలిలో, తలకిందులుగా వేలాడుతూ.. ప్రాణాల కోసం భయంభయంగా అరవడం మొదలుపెట్టారు. ఎంత ప్రయత్నించినా లోపం సరికాకపోవడంతో.. అక్కడి సిబ్బంది తలలు పట్టుకుంది.
అయితే అక్కడి పరిస్థితి గమనించిన ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి పెండ్యులం మీదకు వెళ్లి అక్కడి రాడ్ ను సరి చేశాడు. దాంతో పది నిమిషాల తర్వాత పెండ్యులం ఎక్కిన వాళ్లంతా ప్రాణాలతో భయపడ్డారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందరికీ భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టే ప్రాణాలతో బయటపడ్డారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.