Hyderabad Murder: హైదరాబాద్ లో మరో పరువు హత్య..!
హైదరాబాద్ నడిబొడ్డున శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ప్రేమపెళ్లి చేసుకున్నాడన్న కక్షతో నీరజ్ పన్వార్ అనే యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.
- By Hashtag U Published Date - 01:45 AM, Sat - 21 May 22

హైదరాబాద్ నడిబొడ్డున శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ప్రేమపెళ్లి చేసుకున్నాడన్న కక్షతో నీరజ్ పన్వార్ అనే యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఒకేసారి నలుగురు వ్యక్తులు దాడి చేయడంతో నీరజ్ అక్కడిక్కడే మరణించాడు. ప్రేమపెళ్లి చేసుకున్నాడన్న కారణంగా ఈ మధ్యే నాగరాజు అనే యువకుడిని అతడి భార్య సోదరుడు నడిరోడ్డుపై చంపేసిన ఘటన మరవకముందే ఈ తరహాలో నగరంలో రెండో ఘటన జరగడం కలకలం రేపుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు రెండు జరగడంపై నగర జనం వణికిపోతున్నారు.
బేగంబజార్ పరిధిలోని మచ్చిమార్కెట్ లో ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ ఘటనలో నిందితులు కత్తులతో 20 సార్లు పొడవడంతో బాధితుడు అక్కడిక్కడే మరణించాడు. ఘటన తర్వాత నిందితులు బైక్ పై పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. . మృతుడు నీరజ్ పన్వార్ అని తెలిసింది. సంవత్సరం క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడని పోలీసులు విచారణలో తేలింది. అప్పటి నుంచి అతడిపై యువతి కుటుంబం పగ పెంచుకున్నట్లు సమాచారం. ఈ ప్రాథమిక సమాచారంతో షాహినాథ్ గంజ్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.