Manipur Violence: మణిపూర్‌లో ఉగ్రవాదుల 12 బంకర్లను ధ్వంసం చేసిన బలగాలు
మణిపూర్ హింస కొనసాగుతుంది. మణిపూర్ అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు.
- By Praveen Aluthuru Published Date - 11:18 AM, Mon - 26 June 23

Manipur Violence: మణిపూర్ హింస కొనసాగుతుంది. మణిపూర్ అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా మణిపూర్‌లో పర్యటించి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకున్నారు. తాజాగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి విపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకుంది కేంద్రం.
మణిపూర్ హింసలో ఉగ్రవాదులు ప్రవేశించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు కేంద్రం సాయంతో రంగంలోకి దిగింది. గత 24 గంటల్లో మణిపూర్‌లోని హింసాత్మక జిల్లాల్లో ఉగ్రవాదులు నిర్మించిన 12 బంకర్లను పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. మొత్తం 1100 ఆయుధాలు, 13702 మందుగుండు సామాగ్రి మరియు వివిధ రకాలైన 250 బాంబులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు, ఏరియా డామినేషన్, సెర్చ్ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి.
తమంగ్‌లాంగ్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ మరియు కక్చింగ్ జిల్లాల్లో రాష్ట్ర పోలీసులు మరియు కేంద్ర బలగాలు సోదాలు నిర్వహించి కొండలు మరియు లోయలోని 12 బంకర్‌లను ధ్వంసం చేసినట్లు మణిపూర్ పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అయితే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని మణిపూర్ పోలీసులు తెలిపారు.
మణిపూర్ హింసలో ఇప్పటి వరకు 135 మందిని అరెస్టు చేశారు. కర్ఫ్యూ ఉల్లంఘనలు, ఇళ్లలో చోరీలు తదితర కేసుల్లో 135 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటనలో తెలిపారు. మరోవైపు ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రజలు మద్దతుగా ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లోని 9233522822 నంబర్‌కు డయల్ చేసి ఎలాంటి పుకార్లు , ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులకు లేదా భద్రతా బలగాలకు అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read More: Uppal Skywalk: హైదరాబాద్ లో మరో అద్భుతం, నేడు ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం