Pakistan Stampede: పాక్‌లో ఉచిత గోధుమపిండి పథకం.. తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత
పాకిస్థాన్‌లో నెలకొన్న ఆహార సంక్షోభం అక్కడి పరిస్థితులను రోజురోజుకూ దిగజారుస్తోంది. ఒకవైపు భారీ ధరలతో పేదలకు తిండి దొరకని పరిస్థితి నెలకొంటే...
- By Naresh Kumar Published Date - 12:05 AM, Sat - 1 April 23

Pakistan Stampede: పాకిస్థాన్‌లో నెలకొన్న ఆహార సంక్షోభం అక్కడి పరిస్థితులను రోజురోజుకూ దిగజారుస్తోంది. ఒకవైపు భారీ ధరలతో పేదలకు తిండి దొరకని పరిస్థితి నెలకొంటే… ప్రభుత్వం అందించే సాయాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆహారం కోసం ఒక్కసారిగా ఎగబడడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ పంజాబ్ లోని బహవల్పూర్, ముజఫర్గడ్, ఒకారా, పసైలాబాద్, జహానియాన్, ముల్తాన్ జిల్లాలోని కేంద్రాల వద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కేంద్రాల్లో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారని అక్కడి అధికారులు తెలిపారు.
సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్ లోని పేదల కోసం ఉచిత గోధుమ పిండి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఉచిత గోధుమ పిండి కేంద్రాల వద్దకి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇవే ప్రజల ప్రాణాలను తీస్తున్నాయని తెలుస్తోంది.
ఇదిలావుండగా, రద్దీని తగ్గించడానికి, ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఉదయం 6 గంటలకే ఉచిత పిండి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు పంజాబ్ సీఎం ప్రకటించారు. తాజా పరిణామాలతో ప్రాంతీయ మంత్రులు, కార్యదర్శులు రాబోయే మూడు రోజులు కేటాయించిన జిల్లాల్లో విధులు నిర్వహించాలని, గోధుమ పిండి పంపిణీ కేంద్రాలను సందర్శించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు.
పంజాబ్‌లోని వివిధ నగరాల్లో సంభవించిన వ్యాధులు, మరణాలపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ప్రజలకు వారి సౌలభ్యం కోసం మెరుగైన మార్గనిర్దేశం చేయాలని, వాటిని అమలయ్యేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజల మరణాలకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నఖ్వీ బాధ్యులని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చిందని, దీంతో ఉచిత పిండిని సేకరించేందుకు ఎగబడి చనిపోతున్నారన్నారు.